[1] తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.
[2] అతడు తన పాలనలో నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని ప్రారంభించాడు.
[3] దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
[4] మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు ఇరవై మూరలు. మూరలు. దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.
[5] మందిరం లోపలి పెద్ద గది పై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పై భాగంలో ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటి నగిషీ చెక్కించాడు.
[6] ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది.
[7] మందిరం దూలాలనూ స్తంభాలనూ గోడలనూ తలుపులనూ బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు.
[8] దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి ఇరవై మూరలు. దాని వెడల్పు ఇరవై మూరలు. ఇరవై వేల కిలోల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించాడు.
[9] ఒక్కొక్క మేకు బరువు ఏభై తులాల బంగారం. గది పై భాగాలను అతడు బంగారంతో పొదిగించాడు.
[10] అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు.
[11] ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది.
[12] రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది
[13] ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.
[14] అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.
[15] అంతే గాక ముందు 35 మూరల పొడవున్న రెండు స్తంభాలూ, వాటి మీదకి ఐదు మూరల పొడవున్న పీటలూ చేయించాడు.
[16] గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు.
[17] ఆ రెండు స్తంభాలనూ దేవాలయం ముందు కుడి వైపున ఒకటీ ఎడమ వైపున ఒకటీ నిలబెట్టి, కుడి వైపు దానికి “యాకీను” అనీ, ఎడమ వైపు దానికి “బోయజు” అనీ పేర్లు పెట్టాడు.