Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:26

[1] పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.

[2] ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది.

[3] వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.

[4] దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు.

[5] ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.

[6] ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.

[7] అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో.

[8] శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.

[9] ఈ సందేశం విశ్వసనీయమైనదీ పూర్తిగా అంగీకరించదగినదీ.

[10] మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.

[11] ఈ సంగతులు ఆదేశించి నేర్పు.

[12] నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు.

[13] నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.

[14] పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.

[15] నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి.

[16] నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక — Chapters