Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:41

[1] ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు.

[2] కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి.

[3] అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి.

[4] తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి.

[5] ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?

[6] అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో.

[7] అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

[8] అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు.

[9] వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి.

[10] మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వనివారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు.

[11] అలాగే వారి భార్యలు కూడా గౌరవించదగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి.

[12] పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి.

[13] పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకుని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు.

[14] త్వరలో నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను.

[15] ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ.

[16] మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది. ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు. ఆయనను దేవదూతలు చూశారు. దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు. లోకం ఆయనను నమ్మింది. మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.

తిమోతికి రాసిన మొదటి పత్రిక — Chapters