Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:01

[1] సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు.

[2] మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.

[3] దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు,

[4] లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.

[5] ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు.

[6] ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు.

[7] తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.

[8] చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు.

[9] ఎందుకంటే నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి కాబట్టి నాకు అపొస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు.

[10] అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.

[11] నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.

[12] క్రీస్తు మరణించి సజీవుడై లేచాడని మేము ప్రకటిస్తూ ఉంటే మీలో కొందరు అసలు మృతుల పునరుత్థానమే లేదని ఎలా చెబుతారు?

[13] మృతుల పునరుత్థానం లేకపోతే, క్రీస్తు కూడ లేవలేదు.

[14] క్రీస్తు లేచి ఉండకపోతే మా సువార్త ప్రకటనా వ్యర్థం, మీ విశ్వాసమూ వ్యర్థం.

[15] దేవుడు క్రీస్తును లేపాడని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పాం కదా? మృతులు లేవడం అనేది లేకపోతే దేవుడు యేసును కూడా లేపలేదు కాబట్టి మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులమన్నట్టే.

[16] మృతులు లేవకపోతే క్రీస్తు కూడ లేవలేదు.

[17] క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట.

[18] అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే.

[19] మనం ఈ జీవిత కాలం వరకే క్రీస్తులో ఆశ పెట్టుకొనే వారమైతే మనుషుల్లో మనకంటే నిర్భాగ్యులెవరూ ఉండరు.

[20] కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు.

[21] మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది.

[22] ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు.

[23] ప్రతి ఒక్కడూ తన తన వరుసలో బ్రతికించబడతారు. మొదట, అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు, ఆ తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనకు చెందినవారు బ్రతికించబడతారు.

[24] ఆ తరువాత ఆయన సమస్త ఆధిపత్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ రద్దు చేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది.

[25] ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి.

[26] చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.

[27] దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచాడు. సమస్తం అనే మాటలో పాదాల కింద ఉంచిన దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి అని తేటతెల్లం అవుతుంది కదా.

[28] సమస్తమూ కుమారుడికి వశమైన తరువాత దేవుడు సర్వాధికారిగా ఉండే నిమిత్తం ఆయన కుమారుడు సమస్తాన్నీ తన కింద ఉంచిన దేవునికి తానే లోబడతాడు.

[29] ఇదేమీ కాకపోతే చనిపోయిన వారి కోసం బాప్తిసం పొందేవారి సంగతేమిటి? చనిపోయినవారు లేవకపోతే వారి కోసం బాప్తిసం పొందడం ఎందుకు?

[30] మేము గంటగంటకు ప్రాణం అరచేతిలో ఉంచుకుని బతకడం ఎందుకు?

[31] సోదరులారా, మన ప్రభు క్రీస్తు యేసులో మిమ్మల్ని గూర్చి నేను చూపే అతిశయాన్ని బట్టి నేను ప్రకటించేది ఏమిటంటే, “నేను ప్రతి దినం చనిపోతున్నాను.”

[32] నేను ఎఫెసులో క్రూర మృగాలతో పోరాడింది కేవలం మానవరీత్యా అయితే నాకు లాభమేముంది? చనిపోయిన వారు లేవకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి తిని, తాగుదాం.”

[33] మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”

[34] కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను.

[35] అయితే “చనిపోయిన వారు ఎలా లేస్తారు? వారెలాటి శరీరంతో వస్తారు?” అని ఒకడు అడుగుతాడు.

[36] బుద్ధి హీనుడా, నీవు విత్తనం వేసినప్పుడు అది ముందు చనిపోతేనే కదా, తిరిగి బతికేది!

[37] నీవు పాతినది గోదుమ గింజైనా, మరి ఏ గింజైనా, వట్టి గింజనే పాతిపెడుతున్నావు గాని పైకి మొలిచే శరీరాన్ని కాదు.

[38] దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు.

[39] అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు.

[40] ఆకాశంలో వస్తువులున్నాయి, భూమి మీద వస్తువులున్నాయి. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూవస్తు రూపాల మహిమ వేరు.

[41] నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల వెలుగు వేరు. ఒక నక్షత్రానికీ మరొక నక్షత్రానికీ వెలుగులో తేడా ఉంటుంది కదా.

[42] చనిపోయిన వారు తిరిగి లేవడం కూడా అలాగే ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు.

[43] ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా, బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది.

[44] ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తినది ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది.

[45] దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు.

[46] మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి.

[47] మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు.

[48] మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే.

[49] మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం.

[50] సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు.

[51] ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం.

[52] బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం.

[53] నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.

[54] ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.

[55] “మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?”

[56] మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

[57] అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.

[58] కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక — Chapters