Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:49

[1] సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.

[2] అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు.

[3] వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు.

[4] ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.

[5] అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.

[6] వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి.

[7] “ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.

[8] వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.

[9] వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు.

[10] అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.

[11] నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి.

[12] కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.

[13] ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

[14] కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.

[15] తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.

[16] మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే.

[17] మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.

[18] ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?

[19] ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.

[20] యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.

[21] మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.

[22] ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?

[23] అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.

[24] ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి.

[25] మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.

[26] ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.

[27] ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.

[28] అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు.

[29] ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి?

[30] నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

[31] కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.

[32] యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి.

[33] నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక — Chapters