[1] సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది.
[2] దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
[3] మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము. ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము.
[4] కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లైతే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి.
[5] నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి.
[6] ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.
[7] నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను.
[8] అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృధా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను.
[9] ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి.
[10] నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది.
[11] ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.
[12] వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను.
[13] సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను.
[14] గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.
[15] ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
[16] మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము.
[17] సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్న వాళ్ళను గమనించండి.
[18] నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
[19] వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి.
[20] కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము.
[21] అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు చేస్తాడు.