Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:36

[1] దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలపుతూ వ్రాయునదేమనగా:

[2] నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు.

[4] మీరు చేసిన పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణతపొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.

[5] మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు.

[6] కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము.

[7] అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు.

[8] అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.

[9] దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి.

[10] ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసిన వాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి.

[11] ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదేవిధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.

[12] పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట.

[13] ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడు ద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు.

[14] దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది.

[15] దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది.

[16] నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి.

[17] ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు.

[18] దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.

[19] నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి.

[20] ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు.

[21] అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకు పోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.

[22] దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేక పోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు.

[23] దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు.

[25] స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.

[26] తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది.

[27] అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము. ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి. అదే నిజమైన భక్తి.

యాకోబు వ్రాసిన లేఖ — Chapters