[1] అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
[2] “యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు కుమారుడు ఊరు).
[3] బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను.
[4] నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు.
[5] బెసలేలు అందమైన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు.
[6] అతనితో పని చేయటానికి అహూలియాబును కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూలియాబు దాను గోత్రపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పని వాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను.
[7] సన్నిధి గుడారం ఒడంబడిక పెట్టె పెట్టెను మూసే కరుణా పీఠము.
[8] బల్ల, దానిమీద ఉండాల్సినవన్నీ ధూప వేదిక
[9] దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర ఉపయోగించే వస్తువులు గంగాళం, దాని క్రింద పీట.
[10] యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్త్రాలన్నీ, అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసేటప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలన్నీ,
[11] అభిషేకానికి పరిమళ సువాసనగల తైలం, పవిత్ర స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం. ఈ పని వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్ని వస్తువులనూ తయారు చేస్తారు.”
[12] అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
[13] “ఇశ్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; ‘నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి. యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు తెలియజేస్తుంది.
[14] “‘సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. ఏ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి.
[15] పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి.
[16] ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక
[17] ఇశ్రాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.’”
[18] అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళ్లమీద ఈ ఆజ్ఞలు రాసాడు.