Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:47

[1] అందువల్ల యూదులు కాని మీ కోసం పౌలు అని నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను.

[2] దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు.

[3] ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను.

[4] క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది.

[5] ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వీకులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు, తెలియచేసాడు.

[6] ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.

[7] దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను.

[8] దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు.

[9] అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయుమని నాకు అప్పగించాడు.

[10] వాయుమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం.

[11] దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు.

[12] క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము.

[13] మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.

[14] ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను.

[15] కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు.

[16] ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచుమని వేడుకొంటున్నాను.

[17] అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయుమనీ మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయుమనీ ప్రార్థిస్తున్నాను.

[18] అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు.

[19] జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.

[20] దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది.

[21] సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.

ఎఫెసీయులకు వ్రాసిన లేఖ — Chapters