[1] మోషే. ఇశ్రాయేలు నాయకులతో కలసి, ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పాడు: “నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయులుగా ఉండండి.
[2] మీరు యోర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. ఈ రాళ్లకు సున్నము పూయండి.
[3] ఈ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు చేయాలి. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న — పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా దీనిని మీకు వాగ్దానం చేసాడు.
[4] “మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ వేళ నేను మీకు ఆదేశంచినట్టు ఏబాలు కొండ మీద మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు సున్నము పూయాలి.
[5] మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు.
[6] మీరు మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టేటప్పుడు, పగులగొట్టని బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించండి.
[7] మరియు మీరు అక్కడ బలి అర్పణలు అర్పించి, సమాధాన బలులను అర్పించాలి. అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా సమయం గడపండి.
[8] మీరు నిలబెట్టే బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా మీరు రాయాలి.”
[9] లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. ఆయన చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి. ఈ వేళ మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు.
[10] కనుక మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు కావాలి.”
[11] అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా
[12] పాడు: “మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత గెరీజీము కొండమీద నిలబడి ప్రజలకు దీవెనలు ప్రకటించాల్సిన వంశాలు ఏవనగా: షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను.
[13] శాపం ప్రకటించటానికి రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను నఫ్తాలి వంశాలు ఏబాలు కొండమీద నిలబడాలి.
[14] “అప్పుడు లేవీయులు పెద్ద స్వరంతో ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పాలి:
[15] “‘విగ్రహాలను తయారు చేసుకొని, రహస్య స్థలంలో దాచిపెట్టుకొనేవాడు శాపగ్రస్థుడు. ఈ విగ్రహాలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసిన చెక్క, రాయి, లోహపు బొమ్మ మాత్రమే, వాటిని యెహోవా అసహ్యించుకొంటాడు.’ “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[16] “అప్పుడు లేవీయులు ‘తన తల్లినిగానీ తండ్రిని గానీ గౌరవించటం లేదని సూచించే పనులు చేసేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[17] “అప్పుడు లేవీయులు ‘తన పొరుగువాని సరిహద్దు రాయి తొలగించినవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[18] “అప్పుడు లేవీయులు ‘గుడ్డివాడు, దారి తప్పి పోయేటట్టు నడిపించేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[19] “అప్పుడు లేవీయులు ‘విదేశీయులకు, అనాథలకు, విధవలకు న్యాయంగా తీర్పు చెప్పనివాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[20] “అప్పుడు లేవీయులు, ‘ఒకడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[21] “‘ఏ జంతువుతోనై నా లైంగిక సంపర్కం గల వాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[22] “‘తన పోదరితోగాని, తన తండ్రి కూమారైతోగాని, తన తల్లి కుమారైతోగాని లైంగిక సంబంధం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చేప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[23] “‘తన అత్తగారితో లైంగిక సంబంధం ఉన్నవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[24] “అతడు పట్టుబడనప్పటికీ ‘రహస్యంగా మరొకడ్ని చంపినవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[25] “‘నిర్దోషిని ఒకణ్ణి చంపటానికి డబ్బు తీసుకొనేవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
[26] “‘ధర్మశాస్త్రాన్ని బలపర్చకుండా, దీనికి విధేయుడు కానివాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.