[1] మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి.
[2] మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్న వాటిని కాకుండా పరలోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచించండి.
[4] క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు.
[5] మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ, ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి.
[6] వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.
[7] మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
[8] కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు.
[9] మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు, కనుక అసత్యములాడరాదు.
[10] మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు.
[11] ఇక్కడ గ్రీకు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందిన వానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి సిథియనుడికి భేదం లేదు. బానిసకు, బానిసకాని వానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
[12] మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి.
[13] మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
[14] అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది.
[15] క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.
[16] క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి.
[17] మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి.
[18] స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి.
[19] పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు.
[20] పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. అప్పుడు వాళ్ళను ప్రభువు మెచ్చుకొంటాడు.
[21] తండ్రులు తమ పిల్లలకు చిరాకు కలిగించరాదు. అలా చేస్తే వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది.
[22] బానిసలు తమ యజమానుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడే కాకుండా, వాళ్ళ అభిమానం సంపాదించటానికి మాత్రమే కాకుండా, మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసం కారణంగా మనస్ఫూర్తిగా పని చేయాలి.
[23] అలా చేసేది మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మీరు సేవ చేస్తున్నది క్రీస్తు ప్రభువు కోసం.
[24] మీరు ప్రభువుకు దాసులని మీకు తెలుసు. కనుక ఏది చేసినా అది మానవుల కోసమే కాకుండా ప్రభువు కోసం కూడా చేయండి.
[25] తప్పు చేసిన వాడు ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించాలి. దేవుడు పక్షపాతం చూపకుండా తీర్పు చెబుతాడు.