Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:40

[1] ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం.

[2] కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించే వాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు.

[3] ఈ కుంటివాడు, పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.

[4] పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు.

[5] ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు.

[6] అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్న దాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,

[7] అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది.

[8] అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు.

[9] మందిరంలో ఉన్న వాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు.

[10] భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరింగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.

[11] ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటి పెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తు కొంటూ వెళ్ళారు.

[12] పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు?

[13] అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు.

[14] పవిత్రుడు, నీతిమంతుడు, అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు.

[15] మీరు, మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.

[16] “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.

[17] “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు.

[18] కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు.

[19] మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి.

[20] మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.

[21] “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునః స్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి.

[22] మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి.

[23] దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళ నుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’

[24] “సమూయేలు కాలం నుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు.

[25] మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు, మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’ అని అన్నాడు.

[26] దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”

అపొస్తలుల కార్యములు — Chapters