Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:10

[1] నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు.

[2] నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగల వాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్న వాళ్ళకు అప్పగించు.

[3] యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు.

[4] సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు.

[5] అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు.

[6] కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది.

[7] నేను చెప్పే వాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.

[8] దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త.

[9] ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు.

[10] కనుకనే, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.

[11] ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది: మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.

[12] మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం! మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.

[13] మనం నమ్మతగని వాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.

[14] వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను వాదించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది.

[15] దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.

[16] విశ్వాస హీనమైన మాటలు, పనికి రాని మాటలు మాట్లాడవద్దు. అలాంటి వాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు.

[17] వీళ్ళ బోధన పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనైయు, ఫిలేతు, ఈ గుంపుకు చెందిన వాళ్ళు.

[18] వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.

[19] అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు. ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలి వెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.

[20] గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి.

[21] దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.

[22] యవ్వనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచే వాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు.

[23] కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు.

[24] అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి.

[25] తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి.

[26] అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సైతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సైతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్ఛటానికి బంధించి పెట్టాడు.

తిమోతికి వ్రాసిన రెండవ లేఖ — Chapters