Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:36

[1] సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి.

[2] ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం వ్రాసినట్లు లేదా ప్రభువు రానున్న దినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, లేక ఆత్మ ద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా వారించినా భయపడకండి. దిగులు చెందకండి.

[3] మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు.

[4] అంతేగాక దేవునికి సంబంధించిన ప్రతిదానిపై ఆ భ్రష్టుడు తనను తాను హెచ్చించుకొంటూ మందిరంలో ప్రతిష్టించుకుని తానే దేవుణ్ణని ప్రకటిస్తాడు.

[5] నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా?

[6] ఆ భ్రష్టుని రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన సమయానికి రావాలని వాని రాక ఆపబడింది.

[7] వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించే వాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్న వాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు.

[8] అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన వూపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.

[9] ఆ భ్రష్టుడు సైతాను శక్తితో వచ్చి రకరకాల మహాత్కార్యాలు చేస్తాడు. దొంగ చిహ్నాలు, అద్భుతాలు చేసి మోసం చేస్తాడు.

[10] నాశనం కానున్న వాళ్ళను అన్ని విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించటానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు కనుక నశించిపోతారు.

[11] ఈ కారణంగా దేవుడు వాళ్ళకు మోసం చేసే శక్తిని పంపుతాడు. వాళ్ళు దాన్ని నమ్ముతారు.

[12] సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించాలని నిశ్చయించుకొన్న వాళ్ళందరినీ శిక్షిస్తాడు.

[13] సోదరులారా! ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుటవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్నుకొన్నాడు.

[14] మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ, దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు.

[15] సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా బోధన ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా నిష్టతో అనుసరించండి.

[16] యేసు క్రీస్తు ప్రభువు, మనల్ని ప్రేమించిన మన తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు అనంతమైన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు.

[17] దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక!

థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ — Chapters