Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:04

[1] సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలములను గురించి మేము వ్రాయనవసరం లేదు.

[2] ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు.

[3] ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.

[4] కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు.

[5] మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించిన వాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించిన వాళ్ళము కాము.

[6] మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము.

[7] ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు.

[8] మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను; రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగా ధరించుదాము.

[9] ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు.

[10] మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు.

[11] మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహ పరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.

[12] సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి.

[13] వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి. శాంతంగా జీవించండి.

[14] సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన.

[15] కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.

[16] ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి.

[17] దైవ నియమాన్ని తప్పక పాటించండి.

[18] అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.

[19] ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి.

[20] ప్రవక్తలు చెప్పిన వాటిని తూలనాడకండి.

[21] అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి.

[22] చెడుకు దూరంగా ఉండండి.

[23] శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక!

[24] మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు.

[25] సోదరులారా! మా కోసం ప్రార్థించండి.

[26] సోదరులందరినీ ప్రేమతో హృదయాలకు హత్తుకోండి.

[27] ప్రభువు సమక్షంలో ఈ లేఖను సోదరులందరికీ చదివి వినిపించుమని నేను ఆజ్ఞాపిస్తున్నాను.

[28] మన యేసు ప్రభువు అనుగ్రహం మీపై ఉండుగాక!

థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి లేఖ — Chapters