Skip to content
Opens in a new window

[1] ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు సైన్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతంవద్ద చాలా మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు.

[2] ఫిలిష్తీయులు సౌలుతోను, అతని కుమారులతోను భీకరంగా పోరాడారు. సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.

[3] సౌలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలుకాండ్రు సౌలు మీద బాణాలు వేయగా సౌలు శరీరంతూట్లు పడిపోయింది.

[4] సౌలు తన ఆయుధాలు మోసేవానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహరించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని చెప్పాడు. కాని సౌలు సహాయకుడు నిరాకరించాడు. అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సౌలు తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు.

[5] అలా సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను పొడుచుకొని సౌలుతో పాటు చనిపోయాడు.

[6] కనుక ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని సహాయకుడు అందరూ చనిరపోయారు.

[7] లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు.

[8] ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద చనిపోయి ఉన్నట్లు వారు చూశారు.

[9] ఫిలిష్తీయులు సౌలు తల నరికి, అతని కవచం తీసుకున్నారు. ఈ వార్తను వారు ఫిలిష్తీయులందరికీ తెలియ జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి కూడ ఆ వార్తను చేరవేశారు.

[10] వారు సౌలు కవచాన్ని అష్ఠారోతు దేవత గుడిలో ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్షాను నగర గోడకు వేలాడదీసారు.

[11] ఫిలిష్తీయులు సౌలుకు చేసిన వాటన్నింటిని గూర్చీ యాబేష్గిలాదు నివాసులు విన్నారు.

[12] కనుక యాబేషునగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి బేత్షాను నగరానికి వెళ్లారు. సౌలు శవాన్ని బేత్షాను నగర గోడ మీదనుంచి వారు దించారు. అలాగే సౌలు కుమారుల శవాలను కూడ ఆ గోడ మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు ప్రజలు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు దహన సంస్కారం చేశారు.

[13] తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు.

1 సమూయేలు — Chapters