Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:54

[1] అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి.

[2] అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు.

[3] ప్రభువు మంచి వాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.

[4] మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు.

[5] మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు.

[6] ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను! పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది. ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”

[7] ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు: “ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది.”

[8] మరొక చోట యిలా వ్రాయబడి ఉంది: “ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.” దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రు పడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.

[9] కాని, మీరు దేవుడు ఎన్నుకొన్నప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మ్మిమ్మల్ని పిలిచాడు.

[10] పూర్వం మీరు దేవుని ప్రజ కాదు. ఇప్పుడు మీరు దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు. కాని యిప్పుడు లభించింది.

[11] ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా, జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.

[12] యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని,” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.

[13] మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తికానివ్వండి,

[14] లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు.

[15] మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక.

[16] స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి.

[17] అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి.

[18] బానిసలారా! తమ యజమానులను, వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి.

[19] ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని, దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు.

[20] నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది.

[21] దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.

[22] “ఆయన ఏ పాపం చేయలేదు! ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”

[23] వారాయన్ని అవమానించినప్పుడు ఎదురుతిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు.

[24] ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి.

[25] ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.

పేతురు వ్రాసిన మొదటి లేఖ — Chapters