[1] రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
[2] దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు కుమారులు.
[3] ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ. ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు.
[4] యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు. ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు.
[5] పెరెసు కుమారులు హెస్రోను, హామూలు.
[6] జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార్ద.
[7] జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను. ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు.
[8] ఏతాను కుమారుడు అజర్యా.
[9] హెస్రోను కుమారులు యెరహ్మయేలు, రాము, కెలూబై.
[10] రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు.
[11] నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు.
[12] బోయజు కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్షయి.
[13] యెష్షయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్షయి రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ కుమారుడు షమ్మాను (షిమియ).
[14] నెతనేలు యెష్షయికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు రద్దయి.
[15] యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు.
[16] సెరూయా, అబీగయీలు ఇద్దరూ వారి తోడబట్టిన ఆడపిల్లలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కుమారులు.
[17] అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు.
[18] హెస్రోను కుమారుడు కాలేబు. తన భార్య అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు మరియు అర్దోను అనేవారు అజూబా కుమారులు.
[19] అజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను పెండ్లి చేసుకొన్నాడు. కాలేబుకు ఎఫ్రాతావల్ల హూరు అనే కుమారుడు కలిగాడు.
[20] ఊరి అనేవాడు హూరు కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు కలిగాడు.
[21] పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడైనప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు పుట్టెను.
[22] సెగూబుకు పుట్టినవాడు యాయీరు. యాయీరుకు గిలాదు దేశంలో ఇరవైమూడు నగరాలున్నాయి.
[23] కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి.
[24] హెస్రోను కాలేబదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ.
[25] యెరహ్మయేలు హెస్రోను పెద్ద కుమారుడు. రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాము.
[26] యెరహ్మెయేలుకు అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు తల్లి.
[27] యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు.
[28] షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు.
[29] అబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహయిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, మొలీదు అని వారి పేర్లు.
[30] సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమారులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు.
[31] అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుని పేరు అహ్లయి.
[32] షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు సంతానం లేకుండానే మరణించాడు.
[33] పేలెతు, జాజాలిద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు సంతతి జాబితా.
[34] షేషానుకు కుమారులు లేరు. అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా.
[35] షేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొన్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి.
[36] అత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను కుమారుడు జాబాదు.
[37] జాబాదు కుమారుడు ఎఎ్లాలు. ఎఎ్లాలు కుమారుడు ఓబేదు.
[38] ఓబేదు కుమారుడు యెహూ. యెహూ కుమారుడు అజర్యా.
[39] అజర్యా కుమారుడు హేలెస్సు. హేలెస్సు కుమారుడు ఎలాశా.
[40] ఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమారుడు షల్లూము.
[41] షల్లూము కుమారుడు యెకమ్యా. యెకమ్యా కుమారుడు ఎలీషామా.
[42] యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను.
[43] హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము మరియు షెమ అనువారు.
[44] షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.
[45] షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు.
[46] కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు.
[47] యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు.
[48] మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు.
[49] మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా.
[50] ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము.
[51] తరువాతివారు శల్మా మరియు హారేపు. శల్మా కుమారుడు బెత్లేహేము. హారేపు కుమారుడు బేత్గాదేరు.
[52] శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు. శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం:
[53] మరియు కిర్యత్యారీము సంతతి కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. మిష్రాయీయుల సంతతివారే సొరాతీయులు, ఎష్తాయులీయులు.
[54] శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు,
[55] మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ — రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.