[1] “ఆ రోజుల్లో యూదావారికీ జెరుసలం నగర వాసులకూ ముందున్న క్షేమ స్థితి నేను మళ్ళీ ప్రసాదిస్తాను. ఆ కాలంలో ఇలా జరిగిస్తాను:
[2] ఇతర జనాలన్నిటినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి రప్పిస్తాను. అక్కడ నా సొత్తయిన ఇస్రాయేల్ ప్రజ పక్షంగా వారి విషయం న్యాయ విచారణ జరిగిస్తాను. ఎందుకంటే, వారు నా ప్రజను ఇతర జనాల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకొన్నారు.
[3] నా ప్రజలకు చీట్లు వేసి పిల్లవాణ్ణి ఇచ్చి వేశ్యలను తీసుకొన్నారు. త్రాగుదామని ద్రాక్షమద్యంకోసం పిల్లలను అమ్మివేశారు.
[4] “తూరు సీదోను నగరవాసులారా! ఫిలిష్తీయప్రాంతం వారలారా! మీరు నాకేమి చేయాలని? నేను చేసినదానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మీరు చేసినదాన్ని త్వరలోనే, చాలా శీఘ్రంగానే మీ నెత్తిమీదికి రప్పిస్తాను.
[5] ఎందుకంటే, మీరు నా వెండి బంగారాలను తీసుకుపోయారు. నా శ్రేష్ఠమైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్ళలో ఉంచారు.
[6] యూదావారూ జెరుసలం నగరవాసులూ వారి ప్రాంతానికి దూరం కావాలని మీరు వారిని గ్రీస్ దేశస్ధులకు అమ్మివేశారు.
[7] ఇదిగో వినండి, మీరు చేసినదాన్ని మీ నెత్తిమీదికి రప్పిస్తాను. మీరు వారిని అమ్మి పంపివేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా వారిని పురికొలుపుతాను.
[8] వారు మీ కొడుకులనూ కూతుళ్ళనూ కొనేలా చేస్తాను. వారు వాళ్ళను దూరంగా ఉన్న షేబ వారికి అమ్మి వేస్తారు.” యెహోవా ఈ మాట చెప్పాడు.
[9] ఇతర జనాలకు ఈ విషయం చాటించండి: “యుద్ధానికి సిద్ధం చేయండి! వీరులను పురికొలపండి! సైనికులంతా సమకూడి రావాలి.
[10] మీ నాగటి కర్రులను సాగగొట్టి ఖడ్గాలను చేయండి, చెట్ల కొమ్మలను నరికే కత్తులను తీసుకొని ఈటెలను చేయండి. బలహీనులు ‘మేము బలాఢ్యులం’ అని చెప్పుకోవాలి.
[11] చుట్టుపట్ల ఉన్న ఇతర జనాల్లారా! మీరందరూ త్వరగా వచ్చి అక్కడ సమకూడండి.” యెహోవా! నీ బలాఢ్యులను వెంటబెట్టుకురా!
[12] “నలుదిక్కుల ఉన్న ఇతర జనాలన్నిటికీ తీర్పు తీర్చడానికి నేను యెహోషాపాతు లోయలో కూర్చుంటాను గనుక వారు లేచి అక్కడికి రావాలి.
[13] పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. వచ్చి ద్రాక్షపండ్లను త్రొక్కండి. గానుగ నిండి ఉంది. తొట్లు పొర్లి పారుతున్నాయి – జనాల అపరాధం పూర్తిగా పండినట్టే ఉంది.”
[14] తీర్పు లోయలో ప్రజలు గుంపులుగుంపులుగా ఉన్నారు! ఎందుకంటే తీర్పులోయలో యెహోవా దినం ఆసన్నమైంది.
[15] సూర్యమండలం, చంద్రబింబం చీకటి అవుతాయి. నక్షత్రాలు కాంతి తప్పుతాయి.
[16] యెహోవా సీయోనునుంచి గర్జిస్తాడు. జెరుసలం నుంచి ఆయన స్వరం వినబడుతుంది. భూమి, ఆకాశం కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజకు శరణ్యం అవుతాడు, ఇస్రాయేల్ ప్రజకు కోటగా ఉంటాడు.
[17] “అప్పుడు నేను యెహోవాను, మీ దేవుణ్ణి అనీ నేను నా పవిత్రమైన కొండ సీయోనుమీద నివసిస్తున్నాననీ మీరు తెలుసుకొంటారు. జెరుసలం పవిత్రంగా ఉంటుంది. అప్పటినుంచి మరెన్నడూ విదేశీయులు దానిమీదుగా వెళ్ళరు.
[18] ఆ రోజుల్లో పర్వతాల మీదనుంచి క్రొత్త ద్రాక్షరసం పారుతుంది. కొండల మీదనుంచి పాలు పారుతాయి. యెహోవా ఆలయంలోనుంచి నీటి ఊట పెల్లుబికి ప్రవహిస్తూ షిత్తీం లోయను తడుపుతుంది.
[19] కానీ ఈజిప్ట్‌దేశం పాడవుతుంది. ఎదోందేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే, ఈ దేశాలవారు యూదాప్రజను దౌర్జన్యానికి గురి చేసి వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు.
[20] యూదాలో ప్రజలు సదాకాలం నివసిస్తారు. తరతరాలకు జెరుసలం నివాస స్థలంగా ఉంటుంది.
[21] వారి ప్రాణ నష్టానికి నేను ఇది వరకు చేయని ప్రతీకారం ఆ దినం చేస్తాను.” యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు!