[1] ఏడో నెల ఇరవై ఒకటో రోజున హగ్గయి ప్రవక్తకు యెహోవానుంచి వచ్చిన వాక్కు ఇది:
[2] “నీవు షయల్‌తీయేల్ కొడుకూ యూదా అధిపతీ అయిన జెరుబ్బాబెల్‌తోనూ యెహోజాదాక్ కొడుకూ ప్రముఖ యాజీ అయిన యెహోషువతోనూ మిగతా ప్రజలందరితోనూ ఇలా చెప్పు:
[3] పూర్వం ఈ ఆలయానికి ఉన్న వైభవాన్ని చూచినవారు మీలో లేరా? ఇప్పుడిది మీ దృష్టికి ఎలా ఉంది? ఇది చూస్తే ఏమీ లేనట్టే అనిపిస్తుంది గదా!
[4] అయితే యెహోవా చెప్పేదేమంటే, జెరుబ్బాబెల్, ధైర్యం తెచ్చుకో! యెహోజాదాక్ కొడుకూ ప్రముఖయాజీ యెహోషువ, ధైర్యం తెచ్చుకో! దేశంలో ఉన్న ప్రజలారా, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి! ఈ పని చేయండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
[5] మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ఇదే. నా ఆత్మ మీమధ్య ఉన్నాడు గనుక భయపడకండి.
[6] “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, ఇంకా కొంత కాలానికి మరోసారి నేను ఆకాశాలనూ భూమినీ సముద్రాన్నీ ఎండిన నేలనూ కదలిస్తాను.
[7] అన్ని దేశాలవారినీ వణికిస్తాను. అన్ని దేశాలవారు కోరేది రావడం జరుగుతుంది. నేను ఈ ఆలయాన్ని వైభవ మయంగా చేస్తాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.
[8] వెండి నాది, బంగారం నాది అని సేనల ప్రభువు యెహోవా అంటున్నాడు.
[9] ఈ ఆలయం వైభవం మునుపటికంటే చివరికి అధికం అవుతుందని సేనలప్రభువు యెహోవా అంటున్నాడు. ఈ స్థలంలో నేను శాంతి ప్రసాదిస్తాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.”
[10] దర్యావేషు పరిపాలించిన రెండో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాలుగో రోజున యెహోవానుంచి వాక్కు హగ్గయి ప్రవక్తకు వచ్చింది
[11] “సేనలప్రభువు యెహోవా ఆదేశించేదేమంటే, నీవు ధర్మశాస్త్ర సంబంధమైన ఈ ప్రశ్న యాజులను అడుగు:
[12] ఎవడైన ప్రతిష్ఠ చేసిన మాంసం బట్టల చెంగున కట్టుకొనిపోతున్నాడనుకోండి. ఆ చెంగు రొట్టెను గానీ ఎదైన వంటకాన్ని గానీ ద్రాక్షరసాన్ని గానీ నూనెను గానీ మరేదైన తిండిని గానీ తగిలితే ఆ తగిలినది ప్రతిష్ఠితం అవుతుందా?” అందుకు యాజులు “కాదు” అన్నారు.
[13] అప్పుడు హగ్గయి ఇలా అడిగాడు: “ఎవరైనా శవాన్ని ముట్టడంవల్ల అశుద్ధుడై ఆ వస్తువులలో ఒకదానిని తాకితే ఆ తాకినది అశుద్ధమవుతుందా?” అందుకు యాజులు “అది అశుద్ధమవుతుంది” అని జవాబిచ్చారు.
[14] వారితో హగ్గయి ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమంటే, ఈ ప్రజ, ఈ జాతి నా దృష్టిలో అలాగే ఉన్నారు. వారు చేస్తూవుండేదంతా, అక్కడ సమర్పిస్తూ ఉండేదంతా అశుద్ధం.
[15] ఈ రోజునుంచి మీరు దీన్ని గురించి బాగా ఆలోచించండి యెహోవా ఆలయంలో రాయిమీద రాయి ఉంచేముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి.
[16] అప్పుడు ఇరవై తూముల కుప్ప దగ్గరికి పోతే పది తూములు మాత్రమే ఉండేవి, ద్రాక్ష గానుగ తొట్టిలోనుంచి యాభై లీటర్ల రసం తీసుకోవడానికి పోతే ఇరవై లీటర్లు మాత్రమే దొరికేవి.
[17] మీ కష్టార్జితమంతటినీ తెగులుతో, బూజుతో, వడగండ్లతో నేను నాశనం చేశాను. అయినా మీరు నావైపుకు తిరగలేదు. ఇది యెహోవా వాక్కు.
[18] మీరు బాగా ఆలోచించండి. ఈవేళ తొమ్మిదో నెల ఇరవై నాలుగో రోజు. ఈరోజునుంచి, యెహోవా ఆలయం పునాది వేయబడ్డ ఈరోజు నుంచి మీ పరిస్థితులను గురించి బాగా ఆలోచించండి.
[19] గిడ్డంగిలో గింజలు లేవు. ద్రాక్షచెట్లు, అంజూరు చెట్లు, దానిమ్మ చెట్లు, ఆలీవ్ చెట్లు ఇంకా పండలేదు. ఈ రోజునుంచి మీకు ఆశీస్సులు ప్రసాదిస్తాను.”
[20] ఆ నెల ఇరవై నాలుగో రోజున హగ్గయికి యెహోవానుంచి వాక్కు రెండవ సారి వచ్చింది. ఏమంటే,
[21] “యూదా అధికారి జెరుబ్బాబెల్‌తో ఇలా చెప్పు: నేను ఆకాశాలను భూమినీ కదలిస్తాను.
[22] రాజ్యాల సింహాసనాలను క్రింద పడవేస్తాను. ఇతర జనాల రాజ్యాల బలాన్ని నాశనం చేస్తాను. రథాలనూ రథసారథులనూ క్రింద పడవేస్తాను. గుర్రాలూ రౌతులూ ఒకడి ఖడ్గంచేత ఒకడు కూలుతారు.
[23] అయితే సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, షయల్‌తీయల్ కొడుకు జెరుబ్బాబెలూ! నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకొన్నాను గనుక ఆ రోజున నేను నిన్ను తీసుకొని నా ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.