Skip to content
Opens in a new window

[1] సూర్యమండలంక్రింద మరో దుఃఖకరమైన విషయం నాకు కనబడింది. అది మనుషులమీద బలంగా పని చేస్తుంది.

[2] అదేమిటంటే, దేవుడు ఒకానొకడికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తాడు. అతడికి ఏది కావాలంటే అది కొదువ లేకుండా దొరుకుతుంది. కాని, అదంతా అతణ్ణి అనుభవించలేని స్థితిలో ఉంచుతాడు దేవుడు. పరాయివాడెవడో దాన్ని అనుభవించడానికి వస్తాడు. ఇదంతా వ్యర్థం! ఇదంతా తీవ్రమైన బాధ.

[3] ఒకానొకడికి నూరుగురు సంతానం. అతడు దీర్ఘాయుష్మంతుడు. కాని, అతడికి తనకున్న మంచివాటివల్ల తృప్తి ఉండదు. అతడికి సరిగా అంత్యక్రియలు కూడా జరగవు. అతడు చిరకాలం బ్రతికినా, అతడి స్థితికంటే గర్భస్రావమై పోయిన పిండమే నయం అనిపిస్తుంది నాకు.

[4] అకాల జన్మం వ్యర్థంగా కలుగుతుంది. అది చీకట్లోకి పోతుంది. దాని పేరును చీకటి కమ్మివేస్తుంది.

[5] అది సూర్యరశ్మిని చూడదు. దానికి ఏమీ తెలియదు.

[6] ఒక మనిషి రెండు వేల సంవత్సరాలు బ్రతికినా మేలు అనుభవించకపోతే అతడి స్థితిగతులకంటే గర్భస్రావమైన ఆ పిండం స్థితిగతులే నయం! అతడి కంటే ఎక్కువ నెమ్మది లభించేది దానికే. అయినా అంతా చేరేది చివరికి ఒకే చోటికి గదా.

[7] మనుషులు పడే శ్రమ అంతా తిండి తిప్పలే. అయితే ఎంత తిన్నా మనసుకు తృప్తి కలగదు.

[8] మూర్ఖులకంటే జ్ఞానుల గొప్ప ఏమిటీ? బీదవాడు సజీవుల ఎదుట ఎలా ప్రవర్తించాలో నేర్చుకొంటే ఇతడి గొప్ప మట్టుకేముంది?

[9] లేనిదానికోసం తిరుగులాడడం కంటే కనుచూపు మేరలో ఉన్నది అనుభవించడం మేలు. అయినా ఇది కూడా వ్యర్థం! గాలికోసం శ్రమించినట్టే ఉంటుంది.

[10] ఉనికిలో ఉన్న ప్రతిదానికీ పేరు ఉంది. మనిషి ఎలాంటివాడో పూర్వం తెలిసిన విషయమే. మనిషి తనకంటే బలవంతుడితో వివాదం పెట్టుకొని నెగ్గలేడు.

[11] మాటలు ఎక్కువైతే అర్థం తక్కువ అవుతుంది. దానివల్ల మనుషులకు ఏమి ప్రయోజనం?

[12] మనిషి నీడలాగా తన అల్ప జీవితకాలం అంతా వ్యర్థంగా గడిపేవాడు. ఈ బ్రతుకులో మనిషికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? అతడు గతించాక, సూర్యమండలం క్రింద ఏమి జరుగుతుందో అతడికి ఎవరు తెలియజేయగలరు?

ప్రసంగి — Chapters