Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:34

[1] యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.

[2] “ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు.

[3] మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాను. ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను. భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.” ఇదే యెహోవా వాక్కు.

[4] “నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి, బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.

[5] మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.

[6] యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”

[7] యెహోవా దినం సమీపించింది. ఆయన బలి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.

[8] “యెహోవాకు బలి అర్పించే దినాన అధిపతులను, రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.

[9] ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”

[10] ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.

[11] కనానీయులంతా నాశనమయ్యారు. డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.

[12] ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను. పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.

[13] వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. వారి ఇళ్ళు పాడైపోతాయి. వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.

[14] యెహోవా మహా దినం దగ్గర పడింది. యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది. వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది. పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.

[15] ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. అంధకారం, మసక కమ్మే రోజు. మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.

[16] ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.

[17] ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గుడ్డివారిలాగా నడుస్తారు. వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది. వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.

[18] యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.

జెఫన్యా — Chapters