Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:08

[1] నేను మళ్ళీ తేరిచూడగా రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతాలు ఇత్తడివి.

[2] మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,

[3] మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు చుక్కలుగల బలమైన గుర్రాలు పూన్చి ఉన్నాయి.

[4] “స్వామీ, ఇవేమిటి?” అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను.

[5] అతడు నాతో ఇలా అన్నాడు. “ఇవి సర్వలోకనాధుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు దేరే ఆకాశపు నాలుగు గాలులు.

[6] నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశంలోకి పోయేది. తెల్లని గుర్రాలున్న రథం వాటి వెంబడి పోతుంది, చుక్కలు చుక్కల గుర్రాలు గల రథం దక్షిణ దేశంలోకి పోతుంది.”

[7] బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతట సంచరించడానికి సిద్ధంగా ఉండగా “పోయి లోక మంతటా సంచరించండి” అని అతడు చెప్పాడు. అప్పుడు అవి లోకమంతా సంచరించాయి.

[8] అప్పుడతడు నన్ను పిలిచి “ఉత్తరదేశంలోకి పోయే వాటిని చూడు. అవి ఉత్తరదేశంలో నా ఆత్మకు విశ్రాంతి కలిగిస్తాయి” అని నాతో అన్నాడు.

[9] యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే

[10] చెరలోకి పోయిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయా, అనేవారు జెఫన్యా కుమారుడు యోషీయా ఇంట్లో దిగారు. వారు చేరిన దినాన్నే నీవు ఆ ఇంటికి పోయి

[11] వారినడిగి వెండి బంగారాలు తీసుకుని, కిరీటం చేసి ప్రధాన యాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి

[12] అతనితో ఇలా చెప్పు. “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, చిగురు అనే ఒకడు ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తాడు. అతడు యెహోవా ఆలయం కడతాడు.

[13] అతడే యెహోవా ఆలయం కడతాడు. అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ యిద్దరికీ సమాధానకరమైన ఆలోచనలు కలుగుతాయి.

[14] ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. హేలెముకు, టోబీయాకు, యెదాయాకు, జెఫన్యా కుమారుడు హేనుకు స్మారక చిహ్నంగా ఉంటుంది.

[15] దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు, అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా వింటే ఇలా జరుగుతుంది.”

జెకర్యా — Chapters