[1] నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి.
[2] ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు.
[3] నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.
[4] ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు.
[5] నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు.
[6] ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు.
[7] ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు.
[8] నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు.
[9] ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు.
[10] నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు.
[11] నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు.
[12] విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు.
[13] తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు.
[14] నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు.
[15] చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు.
[16] రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు.
[17] నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు.
[18] కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను.
[19] నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను.
[20] కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.
[21] కాని, నేను దీన్ని గుర్తు చేసుకొన్నప్పుడు నాకు ఆశ కలుగుతూ ఉంది.
[22] యెహోవా కృప గలవాడు. ఆయన నిబంధన నమ్మకత్వాన్ని బట్టి మనం ఇంకా పూర్తిగా నాశనం కాలేదు.
[23] ప్రతి రోజూ మళ్ళీ కొత్తగా ఆయన దయగల చర్యలు చేస్తాడు. నీ నమ్మకత్వం ఎంతో గొప్పది!
[24] “యెహోవా నా వారసత్వం” అని నా ప్రాణం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఆయనలోనే నా నమ్మిక ఉంచుతున్నాను.
[25] తన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ పట్ల, ఆయనను వెదికే వాళ్ళ పట్ల యెహోవా మంచివాడు.
[26] యెహోవా కలిగించే రక్షణ కోసం మౌనంగా కనిపెట్టడం మంచిది.
[27] తన యవ్వనంలో కాడి మోయడం మనిషికి మంచిది.
[28] అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగానూ, మౌనంగానూ కూర్చుని ఉండాలి.
[29] ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.
[30] అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.
[31] ప్రభువు అతన్ని ఎల్లకాలం తృణీకరించడు.
[32] ఆయన శోకం రప్పించినా, తన నిబంధన నమ్మకత్వపు గొప్పదనాన్ని బట్టి కనికరం చూపిస్తాడు.
[33] హృదయపూర్వకంగా ఆయన మనుషులను పీడించడు, బాధ కలిగించడు.
[34] దేశంలో బందీలుగా ఉన్నవాళ్ళందరినీ కాళ్ల కింద తొక్కడం,
[35] మహోన్నతుని సన్నిధిలో మనుషులకు న్యాయం దొరకక పోవడం,
[36] ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా?
[37] ప్రభువు ఆజ్ఞలేకుండా, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చ గలవాడెవడు?
[38] మహోన్నతుడైన దేవుని నోట్లో నుంచి కీడు, మేలు రెండూ బయటకు వస్తాయి గదా?
[39] బతికున్న వాళ్ళల్లో ఎవరికైనా తమ పాపాలకు శిక్ష వేస్తే మూలగడం ఎందుకు?
[40] మన మార్గాలు పరిశీలించి తెలుసుకుని మనం మళ్ళీ యెహోవా వైపు తిరుగుదాం.
[41] ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం.
[42] మేము అతిక్రమం చేసి తిరుగుబాటు చేశాం. అందుకే నువ్వు మమ్మల్ని క్షమించలేదు.
[43] నువ్వు కోపం ధరించుకుని మమ్మల్ని తరిమావు. దయ లేకుండా మమ్మల్ని వధించావు.
[44] మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.
[45] జాతుల మధ్య మమ్మల్ని విడనాడి, పనికిరాని చెత్తగా చేశావు.
[46] మా శత్రువులందరూ మమ్మల్ని చూసి నోరు తెరిచి ఎగతాళి చేశారు.
[47] గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి.
[48] నా ప్రజల కుమారికి కలిగిన నాశనం నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతోంది.
[49] యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ,
[50] నా కన్నీరు ఆగదు. అది ప్రవహిస్తూనే ఉంటుంది.
[51] నా పట్టణపు ఆడపిల్లలందరినీ చూస్తూ నా కళ్ళకు తీవ్రమైన బాధ కలుగుతోంది.
[52] ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు.
[53] వారు నన్ను బావిలో పడేసి నా మీద రాయిని పెట్టారు.
[54] నీళ్లు నా తల మీదుగా పారాయి. నేను నాశనమయ్యానని అనుకొన్నాను.
[55] యెహోవా, అగాధమైన గుంటలోనుంచి నేను నీ నామాన్ని పిలిచాను.
[56] సాయం కోసం నేను మొర్ర పెట్టినప్పుడు నీ చెవులు మూసుకోవద్దు అని నేనన్నప్పుడు, నువ్వు నా స్వరం ఆలకించావు.
[57] నేను నీకు మొర్ర పెట్టిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో “భయపడవద్దు” అని చెప్పావు.
[58] ప్రభూ, నువ్వు నా జీవితపు వివాదాల విషయంలో వాదించి నా జీవాన్ని విమోచించావు.
[59] యెహోవా, నాకు కలిగిన అణిచివేత నువ్వు చూశావు. నాకు న్యాయం తీర్చు.
[60] నా మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు చేసే ఆలోచనలన్నీ నీకు తెలుసు.
[61] యెహోవా, వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు, వాళ్ళు పలికే దూషణ నువ్వు విన్నావు.
[62] నా మీదికి లేచిన వాళ్ళు పలికే మాటలు, రోజంతా వాళ్ళు నా గురించి చేసే ఆలోచనలు నీకు తెలుసు.
[63] యెహోవా, వాళ్ళు కూర్చున్నా లేచినా, వాళ్ళు ఎగతాళిగా పాడే పాటలకు నేనే గురి.
[64] యెహోవా, వాళ్ళ చేతులు చేసిన పనులను బట్టి నువ్వు వాళ్లకు ప్రతీకారం చేస్తావు.
[65] వాళ్ళ గుండెల్లో భయం పుట్టిస్తావు. వాళ్ళను శపిస్తావు.
[66] యెహోవా, ఉగ్రతతో వాళ్ళను వెంటాడుతావు. ఆకాశం కింద ఉండకుండాా వాళ్ళను నాశనం చేస్తావు.