[1] యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే
[2] “నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.”
[3] కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది.
[4] యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు.
[5] నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు.
[6] ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.
[7] అతడు ఇలా ప్రకటన చేయించాడు “రాజూ ఆయన మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, మనుషులు ఏమీ తినకూడదు. పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు.”
[8] “మనుషులు, పశువులు గోనెపట్ట కట్టుకుని దేవునికి బిగ్గరగా మొర్రపెట్టాలి. అందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చేస్తున్న దౌర్జన్యం మానాలి.
[9] ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?”
[10] నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు.