Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:44

[1] ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు,

[2] ఇతర ప్రజలందరినీ సమకూర్చి, యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి నేను అక్కడ వారిని శిక్షిస్తాను. వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకున్నారు.

[3] వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు. తాగడానికి ద్రాక్ష మద్యం కోసం ఒక పిల్లను అమ్మేశారు.

[4] తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా, నా మీద మీకెందుకు కోపం? నా మీద ప్రతీకారం చూపిస్తారా? మీరు నా మీద ప్రతీకారం చూపించినా మీరు చేసినదాన్ని త్వరలోనే మీ నెత్తి మీదికి రప్పిస్తాను.

[5] మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు.

[6] యూదావారూ యెరూషలేము నగరవాసులూ తమ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని మీరు వారిని గ్రీకులకు అమ్మేశారు.

[7] మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను. మీరు వారిని అమ్మి పంపేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా చేస్తాను.

[8] మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను. వారు దూరంగా ఉండే షెబాయీయులకు వారిని అమ్మేస్తారు. యెహోవా ఈ మాట చెప్పాడు.

[9] రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి.

[10] మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి.

[11] చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, మీరంతా త్వరగా సమకూడిరండి. యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా.

[12] రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. చుట్టు పక్కలుండే రాజ్యాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.

[13] పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. తొట్లు పొర్లి పారుతున్నాయి. వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.

[14] తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు.

[15] సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.

[16] యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. భూమ్యాకాశాలు కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.

[17] మీ యెహోవా దేవుణ్ణి నేనే, నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.

[18] ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, షిత్తీము లోయను తడుపుతుంది.

[19] కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు.

[20] యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది.

[21] వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.

యోవేలు — Chapters