[1] మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఆయన మనలను గాయపరిచాడు. ఆయనే మనకు కట్లు కడతాడు.
[2] రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.
[3] యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.
[4] ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.
[5] కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి.
[6] నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను.
[7] ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు.
[8] గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి.
[9] బందిపోటు దొంగలు పొంచి ఉండేలా యాజకులు పొంచి ఉండి షెకెము దారిలో హత్య చేస్తారు. వారు ఘోరనేరాలు చేశారు.
[10] ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది.
[11] నా ప్రజల సంపదలు మళ్ళీ వారికి ఇచ్చినప్పుడు, యూదా, నీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.