Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:53

[1] రాజైన దర్యావేషు పరిపాలనలో ఏడవ నెల ఇరవై ఒకటవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,

[2] “నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడైన యెహోజాదాకు కుమారుడు యెహోషువతోను శేషించిన జనులతోను ఇలా చెప్పు.

[3] పూర్వకాలంలో ఈ మందిరానికి ఉన్న మహిమను చూసినవారు మీలో ఉన్నారు గదా. అలాటి వారికి ఇది ఎలా కనబడుతున్నది? దానితో ఇది ఏ విధంగానూ సరి పోలినది కాదని తోస్తున్నది గదా.

[4] అయినా యెహోవా ఇచ్చే ఆజ్ఞ. జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో. ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.

[5] మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడవద్దు.

[6] సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే ఇక త్వరలోనే, ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను.

[7] ప్రతి రాజ్యాన్నీ నేను కదిలించగా అన్యజనులందరి విలువైన వస్తువులు తీసుకు వస్తారు. నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను.” ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.

[8] “వెండి నాది. బంగారం నాది” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

[9] ఈ చివరి మందిరం మహిమ మునుపటి మందిరం మహిమను మించి పోతుందని సేనల ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలంలో నేను శాంతిసమాధానాలు నిలుపుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.

[10] దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై చెప్పినది ఏమిటంటే,

[11] సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడు. యాజకుల దగ్గర ధర్మశాస్త్ర విచారణ చెయ్యి.

[12] “ఒకడు ప్రతిష్టితమైన మాంసాన్ని తన వస్త్రపు చెంగున కట్టుకుని, తన చెంగుతో రొట్టెనైనా వంటకాన్నైనా, ద్రాక్షారసాన్నైనా, నూనెనైనా మరి ఏ విధమైన భోజన పదార్థాన్నైనా, ముట్టుకుంటే ఆ ముట్టుకున్నది ప్రతిష్ఠితమవుతుందా?” అని యాజకులను అడిగితే, వారు “కాదు” అన్నారు.

[13] “శవాన్ని ముట్టుకోవడం వల్ల ఒకడు అంటుపడి అలాటి వాటిలో దేనినైనా ముట్టుకుంటే, అతడు ముట్టుకున్నది అపవిత్రం అవుతుందా?” అని హగ్గయి మళ్లీ అడిగినప్పుడు యాజకులు “అది అపవిత్రం అవుతుంది” అన్నారు.

[14] అప్పుడు హగ్గయి వారికి ఈ విధంగా జవాబిచ్చాడు. ఈ ప్రజలు కూడా నా దృష్టికి అలానే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ వారక్కడ అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రం. ఇదే యెహోవా వాక్కు.

[15] ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలు ఆ వెనుక మీకు సంభవించినదాన్ని ఆలోచన చేసుకోండి.

[16] అప్పటి నుండి ఒకడు ఇరవై కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. ఏభై కొలల తొట్టి దగ్గరికి ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరకుతున్నది.

[17] తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను, మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను. అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు.

[18] మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందు తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినం నుండి, అంటే యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి.

[19] కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అయినా అంజూరపు చెట్లు అయినా దానిమ్మ చెట్లయినా ఒలీవ చెట్లు అయినా ఫలించాయా? అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

[20] రెండవ సారి ఆ నెల ఇరవై నాలుగవ దినాన యెహోవా వాక్కు హగ్గయికి మళ్ళీ ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

[21] “యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు. ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.

[22] రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.

[23] నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.”

హగ్గయి — Chapters