[1] స్వేచ్ఛగా ఉండడం కోసం క్రీస్తు మనలను విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడండి. మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
[2] మీరు సున్నతి పొందితే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
[3] సున్నతి పొందిన ప్రతి మనిషీ ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసి ఉంటుందని నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
[4] మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునే వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
[5] మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
[6] యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో, పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పని చేసే విశ్వాసమే ముఖ్యం.
[7] మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
[8] ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడి నుంచి కలగలేదు.
[9] పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది.
[10] మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
[11] సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి తీసివేస్తుంది గదా?
[12] మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారు తమ్మును తాము నరికి వేసికోవడం మంచిది.
[13] సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
[14] ధర్మశాస్త్రమంతా “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉంది.
[15] అయితే మీరు ఒకరినొకరు కరచుకుని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
[16] నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
[17] శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
[18] ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
[19] శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
[20] విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
[21] శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
[22] అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
[23] అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు.
[24] క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
[25] మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.
[26] అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం.