Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:59

[1] నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.

[2] నిన్ను వెనక్కి తిప్పి నడిపించి దూరంగా ఉత్తరాన ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతాలకు రప్పిస్తాను.

[3] నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను.

[4] నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు.

[5] నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

[6] ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.

[7] నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను.

[8] ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

[9] ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.

[10] ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

[11] “ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు.

[12] దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది.

[13] ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు.

[14] దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు.

[15] దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు.

[16] హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.”

[17] “నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.

[18] బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు.

[19] మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి.

[20] నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

[21] నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు.

[22] ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు.

[23] ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు.

[24] వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.

[25] కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను.

[26] వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు.

[27] అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.

[28] వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు.

[29] అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

యెహెజ్కేలు — Chapters