Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:29

[1] ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటినీ మోషేకు చూపించాడు.

[2] దాను వరకూ గిలాదు ప్రదేశాన్నీ, నఫ్తాలి ప్రాంతాన్నీ, ఎఫ్రాయీము మనష్షే ప్రాంతాన్ని, పశ్చిమ సముద్రం వరకూ యూదా ప్రాంతమంతా,

[3] దక్షిణ దేశాన్నీ, ఈత చెట్లు ఉన్న యెరికో పట్టణం నుంచి సోయరు వరకూ ఉన్న మైదానాన్నీ అతనికి చూపించాడు.

[4] యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. దాన్ని నీ కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.”

[5] యెహోవా సేవకుడు మోషే యెహోవా మాట ప్రకారం మోయాబు దేశంలో చనిపోయాడు.

[6] బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతణ్ణి సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.

[7] మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అప్పటికి అతని కళ్ళు మసకబారలేదు. అతని బలం తగ్గలేదు.

[8] ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాల్లో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిసాయి.

[9] నూను కొడుకు యెహోషువ, జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

[10] యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకూ అతని సేవకులందరికీ

[11] అతని దేశమంతట్లో సూచక క్రియలనూ మహత్కార్యాలనూ చేయడానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు.

[12] మహా బల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు, భయం గొలిపే పనులు చేసిన మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు.

ద్వితీయోపదేశ కాండము — Chapters