Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:33

[1] ప్రభువు శిష్యులను హతమారుస్తానని సౌలు యింకా బెదిరింపు మాటలు పలుకుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి

[2] యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు.

[3] అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.

[4] అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు.

[5] “ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, “నువ్వు హింసిస్తున్న యేసుని.

[6] లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు.

[7] అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు.

[8] సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు.

[9] అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.

[10] దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు.

[11] అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.

[12] దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు.

[13] అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు.

[14] ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు.

[15] అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం.

[16] ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు.

[17] అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు.

[18] వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.

[19] అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.

[20] వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు.

[21] విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు.

[22] అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు.

[23] చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.

[24] వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు.

[25] అయితే అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు.

[26] అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.

[27] అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు.

[28] అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ,

[29] ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు.

[30] సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు.

[31] కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.

[32] ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.

[33] అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి,

[34] “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే

[35] వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.

[36] యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది.

[37] ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.

[38] లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.

[39] పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు.

[40] పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది.

[41] అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.

[42] ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.

[43] పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు.

అపొస్తలుల కార్యములు — Chapters