[1] ఇక ఇతర విషయాలకు వస్తే సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా,
[2] మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
[3] అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
[4] మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.
[5] దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!
[6] సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.
[7] మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.
[8] ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
[9] మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు.
[10] అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా!
[11] మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం.
[12] అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
[13] సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు.
[14] ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాణ్ణి కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో కలిసి ఉండవద్దు.
[15] అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి.
[16] శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!
[17] నేను పౌలును, నా చేతి రాతతో మీకు అభివందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి పత్రికలోనూ ఇలాగే రాస్తాను.
[18] మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండు గాక!