Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:25

[1] యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి మూడు సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు.

[2] యెహోవా అతని మీదకి, తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారం యూదాదేశాన్ని నాశనం చెయ్యడానికి దాని మీదకి కల్దీయుల సైన్యాలను, సిరియనుల సైన్యాలను, మోయాబీయుల సైన్యాలను, అమ్మోనీయుల సైన్యాలను రప్పించాడు.

[3] మనష్షే చేసిన పనుల కారణంగా, అతడు నిరపరాధులను హతం చేసిన కారణంగా, యూదావారు యెహోవా సముఖం నుంచి తొలగి పోయేలా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఇది వాళ్లకు జరిగింది.

[4] అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.

[5] యెహోయాకీము చేసిన ఇతర పనుల గురించి, అతడు జరిగించిన వాటన్నిటి గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

[6] యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.

[7] బబులోనురాజు ఐగుప్తు నదికీ, యూఫ్రటీసు నదికీ మధ్య ఐగుప్తురాజు ఆధీనంలో ఉన్న భూమి అంతటినీ పట్టుకొన్న తరువాత, ఐగుప్తురాజు ఇక ఏ ప్రాంతం మీదకీ యుద్ధానికి వెళ్ళలేదు.

[8] యెహోయాకీను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. యెరూషలేమువాడు ఎల్నాతాను కూతురు నెహుష్తా అతని తల్లి.

[9] అతడు తన తండ్రి చేసినట్టే చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.

[10] ఆ కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు.

[11] వారు పట్టణానికి ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు, బబులోను రాజు నెబుకద్నెజరు స్వయంగా తానే దాని మీదకి వచ్చాడు.

[12] అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.

[13] ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.

[14] ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.

[15] అతడు యెహోయాకీను రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారాన్ని, దేశంలో ఉన్న గొప్పవాళ్ళను యెరూషలేము నుంచి బబులోను పట్టణానికి బందీలుగా తీసుకు వెళ్ళాడు.

[16] ఏడు వేలమంది పరాక్రమవంతులను, వెయ్యిమంది కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను, యుద్ధంలో ఆరితేరిన శక్తిమంతులందర్నీ బబులోనురాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు.

[17] ఇంకా బబులోను రాజు యెహోయాకీను బాబాయి మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు.

[18] సిద్కియా పరిపాలన ఆరంభించినప్పుడు అతనికి 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు.

[19] అతని తల్లి లిబ్నా ఊరివాడు యిర్మీయా కూతురు హమూటలు. యెహోయాకీము చేసినట్టే సిద్కియా చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.

[20] సిద్కియా బబులోనురాజు మీద తిరుగబాటు చేశాడు. యూదావాళ్ళ మీద, యెరూషలేమువాళ్ళ మీద యెహోవాకు ఉన్న కోపం కారణంగా ఆయన తన సముఖంలోనుంచి వాళ్ళను తోలివేయడానికి ఇది దోహదం చేసింది.

2 రాజులు — Chapters