Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:53

[1] అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.

[2] “అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను. రక్షణ దినాన మీకు సాయం చేశాను,” అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.

[3] మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం.

[4] దానికి బదులు మేము అన్ని విషయాల్లో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో

[5] దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కాయకష్టంలో నిద్ర లేని రాత్రుల్లో ఆకలిలో-ఎంతో సహనం చూపాం.

[6] పవిత్రతలో జ్ఞానంలో దీర్ఘశాంతంలో దయలో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమలో

[7] సత్యవాక్యంలో దేవుని శక్తిలో-కుడి ఎడమ చేతుల్లో నీతి ఆయుధాలతో

[8] ఘనతలో ఘనహీనతలో అపవాదుల్లో ప్రశంసల్లో మేము పని చేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే.

[9] అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు.

[10] ఏడుస్తున్నాము కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, అన్నీ ఉన్నవాళ్ళమే.

[11] కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది.

[12] మీ విషయంలో మా అంతరంగం సంకుచితంగా లేదు, మీ అంతరంగమే సంకుచితంగా ఉంది.

[13] మేము చేసినట్టే మీరూ చేయండి. మీరూ మీ హృదయాలను విశాలంగా తెరవండి. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.

[14] అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి?

[15] క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి?

[16] దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”

[17] కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు” అని ప్రభువు చెబుతున్నాడు.

[18] “నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు” అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక — Chapters