Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:49

[1] సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు.

[2] మేము ఫిలిప్పీలో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని కూడా మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకుని దేవుని సువార్తను మీకు ఉపదేశించాము.

[3] ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు.

[4] దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషులను సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము.

[5] మేము ముఖస్తుతి మాటలు ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి.

[6] ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు.

[7] పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం.

[8] మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు కాబట్టి మీ పట్ల ప్రీతితో దేవుని సువార్త మాత్రమే కాదు, మీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.

[9] సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం.

[10] విశ్వాసులైన మీ ముందు మేము ఎంత పవిత్రంగా, నీతిగా, నిందారహితంగా నడచుకున్నామో దానికి మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి.

[11] తన రాజ్యానికీ, మహిమకూ మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండాలని మేము మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ సాక్ష్యం ఇస్తూ

[12] తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.

[13] మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.

[14] ఎలాగంటే సోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. వారు యూదుల వలన అనుభవించిన హింసలే ఇప్పుడు మీరు కూడా మీ స్వదేశీయుల వలన అనుభవిస్తున్నారు.

[15] వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని తరిమివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనుషులందరికీ విరోధులు.

[16] యూదేతరులకు రక్షణ కలిగించే సువార్తను ప్రకటించకుండా వారు మమ్మల్ని అడ్డుకున్నారు. తమ పాపాలను పెంచుకుంటూ ఉన్నారు. చివరికి దేవుని తీవ్ర కోపం వారి మీదికి వచ్చింది.

[17] సోదరులారా, మేము కొంతకాలం హృదయం విషయంలో కాకున్నా శరీర రీతిగా దూరంగా ఉన్నాము. అందుచేత మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.

[18] కాబట్టి మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు.

[19] ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా!

[20] నిజంగా మా మహిమా ఆనందమూ మీరే.

తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక — Chapters