[1] రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు.
[2] నెబాతు కొడుకు యరొబాము, సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు.
[3] ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు.
[4] “మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని, మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”
[5] అందుకు రాజు “మీరు వెళ్లి మూడు రోజులైన తరువాత నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పగా ప్రజలు వెళ్లిపోయారు.
[6] అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?” అని వారిని అడిగాడు.
[7] వారు “ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు” అన్నారు.
[8] అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని
[9] “మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?” అని ప్రశ్నించాడు.
[10] అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. “నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది.
[11] మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
[12] “మూడో రోజు నా దగ్గరికి రండి” అని రాజు చెప్పినట్టు యరొబాము, ప్రజలంతా మూడో రోజు రెహబాము దగ్గరికి వచ్చారు.
[13] అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి, యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు.
[14] “మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”
[15] ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు.
[16] కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
[17] అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు.
[18] తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు.
[19] ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు.
[20] యరొబాము తిరిగి వచ్చాడని ఇశ్రాయేలు వారంతా విని, సమాజంగా కూడి, అతన్ని పిలిపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రం వాళ్ళు తప్ప దావీదు సంతానాన్ని వెంబడించిన వారెవరూ లేకపోయారు.
[21] రెహబాము యెరూషలేము చేరుకున్న తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేశాడు. రాజ్యం సొలొమోను కొడుకు రెహబాము అనే తనకు మళ్ళీ వచ్చేలా చేయడానికి అతడు యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రికుల్లోనుండి యుద్ధ ప్రవీణులైన 1, 80,000 మందిని సమకూర్చాడు.
[22] కానీ దేవుడు షెమయా ప్రవక్తతో ఇలా చెప్పాడు.
[23] “నీవు సొలొమోను కొడుకు, యూదా రాజు అయిన రెహబాముతో, యూదా గోత్రం వారితో బెన్యామీనీయులందరితో, మిగిలిన ప్రజలందరితో ఇలా చెప్పు,
[24] యెహోవా చెప్పేదేమిటంటే, జరిగినది నేనే జరిగించాను. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీ సోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకుండా అందరూ మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపొండి.” కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయారు.
[25] తరువాత యరొబాము ఎఫ్రాయిము కొండప్రాంతంలో షెకెము అనే పట్టణాన్ని కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడ నుంచి వెళ్లి పెనూయేలును కట్టించాడు.
[26] యరొబాము ఇలా అనుకున్నాడు. “ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి ఎక్కి వెళ్తే వారి హృదయం యూదారాజు రెహబాము అనే తమ యజమాని వైపుకు తిరుగుతుంది.
[27] అప్పుడు వారు నన్ను చంపి మళ్ళీ యూదా రాజు రెహబాము పక్షం చేరతారు. రాజ్యం మళ్ళీ దావీదు సంతానం వారిది అవుతుంది”
[28] యరొబాము తన హృదయంలో ఇలా ఆలోచన చేసి రెండు బంగారు దూడలు చేయించాడు. అతడు ప్రజలను పిలిచి “యెరూషలేము వెళ్ళడం మీకు చాలా కష్టం.
[29] ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే” అని చెప్పి, ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు.
[30] కాబట్టి ఈ పని దోషం అయింది. ఈ రెంటిలో ఒకదాన్ని పూజించడానికి ప్రజలు దాను వరకూ వెళ్ళసాగారు.
[31] అతడు ఉన్నత స్థలాల్లో మందిరాలను ఏర్పరచాడు. లేవీయులు కాని సాధారణమైన వారు కొందరిని యాజకులుగా నియమించాడు.
[32] యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు.
[33] ఈ విధంగా తన మనస్సులో అనుకున్న దాన్ని బట్టి అతడు ఎనిమిదవ నెల, పదిహేనవ రోజు బేతేలులో తాను చేయించిన బలిపీఠం సమీపించాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి, ధూపం వేయడానికి తానే బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు.